ఈ దృశ్యం చూసి ఇక్కడేదో ఏటీఎం కోసం బారులు తీరారు అనుకుంటున్నారా… మీరు పొరబాటు పడ్డట్టే… అంతా డిజిటలైజ్ అయిపోయి క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ లో దేశంలో నెంబర్ అని చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్ లో ఆధార్ అవస్థలు… ఇక్కడ ఆధార్ కార్డు కావాలంటే ఏంచేయాలో తెలుసా… కొండవీటి చాంతాడంత క్యూలో నుంచోవాలి… అదృష్టం బాగుంటే అప్లికేషన్ దొరుకుతుంది. లేదంటే మరుసటి రోజు ఇంకొంచెం తెల్లవారు ఝామునే వచ్చి పడిగాపులు కాయాలి…

ఏపీ సీఎం డిజిటలైజేషన్ పుణ్యమా అని అన్నిటికీ ఇప్పుడు ఆధార్ కార్డు అనివార్యం అవుతోంది. అప్పుడే పుట్టిన పిల్లలకి కూడా అంగన్ వాడీ ఫలాలు దక్కాలంటే ఆధార్ కార్డు చూపించడం తప్పనిసరి. విజయవాడలో ఆధార్ అందించేందుకు మూడు శాశ్వత కేంద్రాలు ఉన్నాయి. ఆ కేంద్రాల్లో రోజూ ఉదయం తొమ్మిది గంటలకు పావుగంటలో సుమారు 150 నుంచి 200 అప్లికేషన్లు ఇచ్చి మూసేస్తున్నారు. వాటిని దక్కించుకునేందుకు జనం ఇలా క్యూలు కడుతున్నారు.

అవసరాలకు తగినట్టు అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్ల చంటిపిల్లలతో అవస్థలు పడాల్సి వస్తోందని జనం వాపోతున్నారు. మూడురోజులు ప్రయత్నించినా అప్లికేషన్ దొరకని సందర్భాలు ఉన్నాయని మండిపడితున్నారు. అన్నిటికీ ఆధార్ తప్పనిసరి అని చెప్తున్న ముఖ్యమంత్రి ఈ దృశ్యాలు చూస్తే ఏం సమాధానం చెబుతారో మరి!

LEAVE A REPLY