తమకు వడ్డించిన భోజనాన్ని చూపిస్తూ సరిపడా ఆహారం ఇవ్వడం లేదని, నాణ్యత ఉండటం లేదని, సైనికులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరూ గుర్తించడం లేదని ఓ జవాన్ సోషల్ మీడియాలో వీడియో పోస్ట చేశాడు. కొన్ని గంటల వ్యవధిలోనే వైరల్ గా మారిన వీడియో దేశాన్ని కుదిపేసింది. కొన్ని లక్షల మంది తమ ఫేస్ బుక్ లో దీన్ని షేర్లు చేశారు.  దీనిపై స్పందించిన హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆ వీడియోపై విచారణ జరపాలని ఆదేశించారు.

అయితే జవాన్ వీడియోపై బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మాత్రం విచిత్రంగా స్పందించింది. వీడియోలో మాట్లాడిన జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ ఓ తాగుబోతని, తరచూ రూల్స్ బ్రేక్ చేస్తుండడంతో చాలాసార్లు కౌన్సెలింగ్ కూడా ఇచ్చామని ఒక ప్రకటనలో తెలిపింది.  వాస్తవాధీనరేఖ వద్ద విధులు నిర్వహించే తేజ్ బహదూర్ సింగ్.. తరచూ పై అధికారులతో గొడవలు పడుతుంటాడని పేర్కొంది. జవాన్లకు ఇస్తున్న ఆహారంలో ఎలాంటి నాణ్యతాలోపం లేదని, వారికి సరిపడా ఆహారం ఇవ్వడం లేదన్న వార్తలు అవాస్తవమని ప్రకటించింది.

వాస్తవాలు చెప్పిన జవాన్ ను తాగుబోతుగా ప్రకటించడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. తాగుబోతు అన్న విషయం పక్కన పెడితే.. అతను చెప్పినవి వాస్తవాలా కాదా విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు, ఆహారం జవాన్లకు అందకుండా ఏమైపోతున్నాయన్న దానిపై విచారణ జరపాలంటున్నారు. సమగ్ర దర్యాప్తు జరిపితే ఆర్మీలోనూ కుంభకోణాలు బయటపడాయంటున్నారు. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఇప్పటికే వీడియోపై విచారణకు ఆదేశించారు.

LEAVE A REPLY