భారతదేశం… శత్రు దుర్బేధ్యమైన దేశం. అదంతా భౌగోళిక గొప్పదనం కాదు. కేవలం 24 గంటలూ పగలు, రాత్రి తేడా లేకుండా రెప్ప వేయకుండా శత్రువులు చొరబడకుండా కాపాలా కాసే సైనికులదే. దేశ రక్షణ కోసం ఎంతోమంది వీరజవాన్లు అమరులయ్యారు.  మరెంతోమంది తమ శరీరభాగాలు కోల్పోయి.. అంగవికలురయ్యారు. దేశ రక్షణ కోసం కన్నవాళ్లను, కట్టుకున్నవాళ్లను, స్నేహితులను అందరినీ వదిలేసి ఒంటరిగా దేశ సరిహద్దుల్లో భరించలేని వేడిలో, గడ్డ కట్టే మంచులో.. తుఫాను వచ్చినా.. ఏం జరిగినా తమ విధులు మాత్రం నిర్వర్తిస్తూనే ఉంటారు. అందుకే మనకు అన్నం పెట్టే రైతు ఎంత ముఖ్యమో.. మనల్ని కంటికి రెప్పలా కాపాడే సైనికుడు కూడా అంతే ముఖ్యం.

దేశ రక్షణ కోసం ఇన్ని కష్టాలు పడుతున్న సైనికులకు సరైన సౌకర్యాలు ఉన్నాయా..? కనీసం కడుపు నిండా తినలేని పరిస్థితి. ఇదంతా అక్కడి పరిస్థితుల ప్రభావం కాదు. కేవలం సైన్యంలోని ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే. అవును నిజమే.. సైనికుడంటే బలంగా ఉండాలి. కానీ రెండు చపాతీలతో సరిపెడతారు. ఉప్పు, కారం లేని పప్పుతో కడుపు నింపుతారు. ఇదంతా మేం చెప్పడం లేదు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో పనిచేస్తున్న ఓ సైనికుడి ఆవేదన.

29 వ బెటాలియన్ లో పనిచేస్తున్న తేజ్ బహదూర్ యాదవ్.. సరిహద్దుల్లో తమ అవస్థలను, జరుగుతున్న అక్రమాలను కళ్లకు కట్టినట్టు వివరించాడు. సైనికుల కోసం ప్రభుత్వం మంచి ఆహారం అందించే ఏర్పాట్లు చేస్తున్నా.. ఉన్నతాధికారులు దాన్ని అమ్ముకొని డబ్బు సంపాదిస్తున్నారు తప్ప… సైనికులను కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కన్నీళ్లతో తన కష్టాన్ని వీడియో ద్వారా చెప్పుకున్నాడు. ఆ వీడియో మీరూ చూడండి… సైనికుల కష్టాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించండి.

LEAVE A REPLY