పొద్దున్న టీవీలో చూస్తే అన్ని ఛానళ్లలోనూ బాసు మేనియానే… అంత ఖాస్ ఏముంది అనిపించింది. ఆంధ్రా, తెలంగాణా రెండు చోట్లా అదే సొద… వరంగల్ ఫ్యాన్స్ కొందరైతే సినిమా చూడకముందే హండ్రెడ్ పర్సెంట్ బాస్ మార్క్ అని సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు. కోడి గుడ్లతో కొట్టిన చోట… పందెం కోళ్లలా సవాళ్లేంటి? విచిత్రం కాకపోతే… మీడియా మేనేజ్డ్ వాయిస్ అనిపించింది… ఫస్ట్ డే రికార్డుల మోత మీద సగటు ప్రేక్షకుడి నుంచి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు(వాస్తవానికి రామానాయుడు గారిని అనాలి… ఆయన వెళ్తూ ఆ హస్తవాసి ఈయనకి ఇచ్చాడు కాబట్టి తప్పులేదు.) వరకు అంతా మాటల కోటలు కట్టేశారు.

కలెక్షన్ల మోత మనకెందుకు కానీ, తొమ్మిదేళ్ల తర్వాత రాజకీయాల రంగు, రుచి, వాసన చూసిన తర్వాత ఎవరైనా ఎలాంటి కథ ఎంచుకుంటారు… ట్రైలర్లలో దుమ్మురేపినట్టుగా అమ్మడు… కుమ్ముడు అని అరవైయేళ్ల వయసులో ఒళ్లిరుచుకుంటే కళ్లప్పగించి చూడటానికి జనాలేమైనా వెర్రివెంగళప్పలా అనిపించింది. సరే తొలి రోజు థ్రిల్ మనమెందుకు మిస్సవాలి. ఓ ఫ్రెండ్ సాయంతో సినిమాకి వెళ్లా… దాదాపు పదేళ్ల తర్వాత అలా సిల్వర్ స్క్రీన్ పై బాస్ మెరుస్తుంటే నిజంగానే ఓసారి ఈల కొట్టాలనిపించింది. స్క్రీన్ పై చిరంజీవిని చూస్తే ఎందుకంత పిచ్చి అనేది అప్పుడు అర్థమైంది.

సినిమాని పోస్ట్ మార్టం చేసి పొట్లం కడితే ఏం వస్తది. రీమేక్ కథే.. కానీ మేకులా గుండెల్లో దిగుతుంది. పడుచోళ్లతో పోటీ పడగలడా అంటే… ఇండియాలో అంత గ్రేసున్న డ్యాన్సర్ని చూపించండి. నాలుగు పాటలు, రెండు ఫైట్లు తప్ప ఏముంది అంటే… మంచి డాక్యుమెంటరీ తీసి టిక్కెట్ పెడితే ఎంతమంది వస్తారో చెప్పండి… సినిమా మొత్తం చిరంజీవే కనిపించాడు. డ్యాన్సులు, కామెడీ, ఫ్లైట్లు, మధ్యలో కన్నీళ్లు పెట్టించే రెండు ప్రశ్నలు. నిజాయితీ ఉంటే రైతు గురించి కంటతడి పెట్టించిన సన్నివేశాన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు. అది చాలదా?

తొమ్మిదేళ్లు చాలా మిస్సయ్యాం బాస్… అయినా పర్లేదు అందుకే అంత కసిగా వచ్చావేమో… ఠాగూర్ సినిమాలో చూసిన వివి వినాయక్ ని ఇందులో చూస్తే ముసలాడయ్యాడు. నువ్వేంటి కుర్రాడివి అయిపోయావ్ విచిత్రంగా..! రూట్ కరెక్ట్ గా వేశావ్… ఇది 2017… 2018 ఏప్రిల్ తో నీ రాజ్యసభ పదవి ముగిసిపోతుంది. నువ్వే రాం రాం చెప్పెయ్… కాంగ్రెస్ కి సెలవు ఇచ్చేయ్… ఇంకో 150 కొట్టొచ్చు… ఎందుకంటే నీ రాజకీయాలకు రాష్ట్రాల తేడాలుంటాయేమో గానీ… నీ నటసౌరభాలకి ఆ తేడాలు అంటవు… నీరు, నీరు, నీరు అంటే కన్నీరు పెట్టేది తెలుగు రాష్ట్రాల రైతులే కాదు దేశమంతా… అందుకే ఈ రాజకీయాలు వదిలేయి బాసూ!
-కామన్ మ్యాన్ కామెంట్

LEAVE A REPLY