కేంద్ర సర్కారుపై పోరుని కాంగ్రెస్ ముమ్మరం చేసింది. మంచిరోజులు రావాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆపార్టీ నేతలు ముక్త కంఠంతో నినదించారు. ఢిల్లీలో జరిగిన జనవేదన సమ్మేళన్ లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా కీలకనేతలందరూ పాల్గొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరోసారి మోడీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఆర్థిక వ్యవస్థ అద్భుత ప్రగతి సాధిస్తోందని జరుగుతున్న ప్రచారం అంతా అబద్దమని తేలిపోయే రోజు వచ్చేసిందని మన్మోహన్ ప్రకటించారు. పెద్దనోట్ల రద్దు దేశాన్ని గడ్డు పరిస్థితుల్లోకి నెట్టేసిందని స్థూల జాతీయోత్పత్తి 6.3శాతానికి పడిపోయినట్టు ఆర్థిక నిపుణులు లెక్కగడుతున్నారని మన్మోహన్ వివరించారు. ఇది సరైన నిర్ణయం కాదని పదే పదే హెచ్చరించినా కేంద్రం మొండి వైఖరిని అవలంభించిందని ఆయన ఆక్షేపించారు.
మరోవైపు రాహుల్ గాంధీ విమర్శల వాడి పెంచారు. దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థలన్నిటినీ కేంద్రం నీరుగార్చిందని ఆరోపించారు. న్యాయవ్యవస్థ, ఆర్బీఐ, ఎన్నికల సంఘం… ఇలా ఒక్కొక్క సంస్థనీ బీజేపీ, ఆరెస్సెస్ నిర్వీర్యం చేస్తూ వచ్చాయని రాహుల్ విమర్శించారు. ఉద్దేశపూరితంగా మోడీ ఈ సంస్థల్ని బలహీనపరుస్తున్నారని… పెద్ద నోట్ల రద్దుతో మంచి రోజులు వస్తాయని చెప్పిన మోడీ ఇప్పుడు ప్రజలకి సమాధానం చెప్పాలని ధ్వజమెత్తారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే మంచి రోజులు వస్తాయని రాహుల్ ప్రకటించడంతో కాంగ్రెస్ నేతలు హర్షధ్వానాలు చేశారు… పార్టీలోని ముఖ్యనేతలందరూ ఈ ఆందోళనలో పాల్గొన్నారు.

LEAVE A REPLY