మోడీ సర్కారుకి పంటికింద రాయిలా మారిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ కి మకాం మార్చబోతున్నారా… సీఎం అభ్యర్థిగా రంగంలో దిగేందుకు వ్యూహం రచిస్తున్నారా… ఆమ్ ఆద్మీలో ఈ పరిణామాలు చకచకా జరిగిపోతున్నట్టే కనిపిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో పంజాబ్ లో ఆప్ నాలుగు ఎంపీ సీట్లని గెలుచుకుంది. అప్పటి నుంచి ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ పై ప్రత్యేక అభిమానం చూపిస్తున్నారు. పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు గట్ట ప్రత్యామ్నాయం కేజ్రీ తీసుకొస్తారని అంతా భావించారు. మాజీ క్రికెటర్ నవజ్యోత్ సిద్దూ బీజేపీకి రాజీనామా చేసినప్పుడు కూడా ఆయన ఆప్ సీఎం అభ్యర్థిగా బరిలో నిలుస్తారని ప్రచారం జరిగింది. కానీ సిద్దూ వేరుకుంపటి పెట్టుకున్నారు. ఫిబ్రవరి 4న పంజాబ్ లో పోలింగ్ జరగనుండటంతో అన్ని పార్టీలు ప్రచార జోరుని పెంచాయి. ఆప్ కూడా సీఎం అభ్యర్థి ఎవరో చెప్పుకుండానే క్యాడర్లో జోష్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. మొహాలీలో ఆప్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆసక్తికర ప్రకటన చేశారు. ‘పంజాబ్ సీఎంగా కేజ్రీవాల్ ని చూడాలనుకుంటే ఆప్ కి ఓటేయండి’ అంటూ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఢిల్లీ సీఎంగా కేజ్రీ తీసుకున్న నిర్ణయాలు పక్కనే ఉన్న పంజాబ్ లో బాగా ప్రచారంలోకి వచ్చాయి. దీన్ని అనుకూలంగా మలుచుకునేందుకు ఆప్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పంజాబ్ సీఎంగా కేజ్రీ వెళ్తే… సిసోడియా ఢిల్లీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఈ రెండు రాష్ట్రాలు ఆప్ చేతిలోకి వెళ్తే కేంద్రానికి మాత్రం కంటిమీద కునుకులేకుండా పోవడం ఖాయం!

LEAVE A REPLY